సికింద్రాబాద్‌లో ‘హస్త’వ్యస్థమేనా!
- ఈసారి దానం నాగేందర్ గెలుపు అంత వీజీ కాదు.
- ఈ స్థానంలో నెలకొన్న తీవ్ర పోటీ.
- అటు కేంద్ర మంత్రి కిషన్‌రెడి..ఇటు పద్దన్నతో ఢీ.
- కాంగ్రెస్ ప్రచారం అంతంతే..స్థానిక నేతల మద్దతూ కరువే.
- నాగేందర్ సైతం ‘లైట్’ తీసుకుంటున్నారని టాక్.
- గెలుపుపై నమ్మకం లేకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదా?.
ఆయన గ్రేటర్ నగరంలో ఓ కీలక నేత. తరుచుగా పార్టీలు మారుస్తుంటారు. ఏ పార్టీలో ఉన్నా గెలుపు సాధిస్తానన్న ధీమాతో ఉంటారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అగ్రనేతలతో సన్నిహితంగా ఉంటారు. మొత్తానికి జంపింగ్ జపాంగ్గా పేరొందిన ఆ నేత ఎవరో కాదు…ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన దానం నాగేందర్..కొద్దిరోజులకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏకంగా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగి కీలకమైన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా..తన ఇమేజ్‌తో గెలుస్తాననే ధీమా నాగేందర్‌లో ఎక్కువ అని పరిశీలకులు అంటుంటారు. అయితే ఇప్పుడు సీన్ మారిందా…ఈ దఫా పార్లమెంట్ బరిలో ఉన్న దానం గెలుపు కష్టమేనా..అంటే అవుననే అంటున్నారు క్షేత్రస్థాయి నేతలు. త్వరిత గతిన మేల్కొని తప్పులు సరిదిద్దుకోకుంటే కాంగ్రెస్‌కు కష్టకాలమే అంటున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో విజయంపై ధీమాగా ఉండగా…క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడం దానం శిబిరంలో కలవరం రేపుతోంది.
ఇవీ ప్రతికూలతలు:
- బీఆర్ఎస్ నుంచి గెలిచిన నాగేందర్ కొద్దిరోజులకే కాంగ్రెస్‌లో చేరడం కొంత మైనస్‌గా చెప్పొచ్చు. ఇదిలా ఉండగానే..తాను ఎంపీగా గెలిస్తే..ఖైరతాబాద్ నియోజకవర్గంలో తన అల్లుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని దానం నాగేందర్ బాగా ప్రచారం చేశాడు. ఇది స్థానిక కాంగ్రెస్ నేత విజయారెడ్డికి తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని అంటున్నారు. ఈ కారణంగానే ఆమె అంటీముట్టనట్లుగా ఉంటున్నారని చెబుతున్నారు.
- సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో చాలా కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో ఒక్క ఖైరతాబాద్ నియోజకవర్గంలో తప్ప మిగతా చోట్ల దానంకు పట్టు లేదు. సరైన క్యాడరూ లేదు. స్థానిక నేతల నుంచి సహకారం కూడా లేదు. దీంతో ఆయన మిగతా చోట్ల ఓట్లు సాధించడం అంత ఆషామాషీ కాదు.
- ఇక ఇదే నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వీరిని ఎదుర్కోవడం నాగేందర్‌కు అంత ఈజీ కాదు. కిషన్‌రెడ్డికి నగర వ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉండడంతో ఆయన అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఓట్లు సాధించే చాన్స్ ఉంది. అలాగే పద్మారావు గౌడ్ కూడా మంచి పేరున్న నేత.
- కిషన్‌రెడ్డి, పద్మారావుగౌడ్‌లతో పోలిస్తే దానం నాగేందర్ ప్రచారంలో వెనుకబడి ఉన్నారు. నాగేందర్‌కు ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో స్థానిక లీడర్లు, పార్టీ క్యేడర్ సహకరించడం లేదని తెలుస్తోంది. దానం కూడా వారిని లైట్ తీసుకుంటుండడంతో పరిస్థితి ‘చేయి’ దాటిందని అంటున్నారు.
రూ.కోట్లు డిమాండ్ :
దానం నాగేందర్‌కు సహకరించడానికి ఆయా ఎమ్మెల్యేలు, మాజీలు, కార్పొరేటర్లు, లోకల్ లీడర్లు ‘మాకేంటి’ అని అడుగుతున్నట్లు తెలుస్తోంది. కోట్లలో డబ్బు ఖర్చు పెడితే కాని ఇక్కడి పరిస్థితులు చక్కబడేలా లేవని దానం వాపోతున్నట్లు తెలుస్తోంది. మొదట రూ.100 కోట్లు ఖర్చు పెట్టయినా గెలుస్తానని చెప్పిన దానం..తర్వాత మాట మారుస్తున్నారట. అంతే కాకుండా ఇతర నేతలకి దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నట్టు కొందరు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఒక రకంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం గెలవడం అంత పెద్ద సమస్య కానప్పటికీ..దానంకి కేవలం ఖైరతాబాద్ అసెంబ్లీ పరిధిలో తప్ప ఇతర ప్రాంతాల్లో నేతలు సహకరిస్తున్నట్టు కనిపించడం లేదు. అందుకు కారణం దానం వ్యవహార శైలి అని కూడా కొందరంటున్నారు. నేతలను కలుపుకుపోలేకపోవడం, ఇంటికి వచ్చిన నేతలను గంటల తరబడి బయటే కూర్చోబెట్టడం, ప్రచారానికి ప్రణాళికలు రూపొందించకపోవడం, కింది స్థాయి కార్యకర్తలకు సైతం ప్రచారం ఖర్చులు ఇవ్వకపోవడం వల్ల నేతలంతా దూరమయ్యారని తెలుస్తోంది.
దానం..మీకిది తగునా :
ఏళ్ల తరబడిగా రాజకీయాల్లో ఉన్న దానం నాగేందర్ ఈసారి కూడా రాత్రికి రాత్రి పార్టీ మారి కాంగ్రెస్‌లోకి రావడం కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడడం లేదు అని సమాచారం. ఇప్పటికే నగర మేయర్ విజయలక్ష్మి పార్టీ వాట్సాప్ గ్రూపులో దానం ప్రోటోకాల్ పాటించడం లేదు అని మెసేజ్ పెట్టారట. ఇది కాస్తా బహిర్గతమవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీన్ని ఆసరాగా చేసుకుని మరికొంత మంది నేతలు సైతం తమ అసంతృప్తిని వెల్లగక్కేందుకు సిద్ధమవుతున్నారట. సీనియర్ నేత అయిన దానం నాగేందర్ జీ..ఇలా చేయడం మీకు తగునా అని సన్నిహితులు హితవుపలుకుతున్నారట. ఇప్పటికైనా దానం మేల్కొంటే వచ్చే వారం రోజుల్లోనైనా పరిస్థితి మారవచ్చని పరిశీలకులు అంటున్నారు.
By ఎన్.మల్లేష్ ( వార్త ).