అంత ఈజీ కాదమ్మా…
- డబ్బు ప్రలోభాలకు పాల్పడడం ఈసారి కష్టమే.
- ఎన్నడూ లేని విధంగా బలగాలను రంగంలోకి దించుతున్న ఈసీ.
సాధారణంగా ప్రతి ఎన్నికలకు ముందు పోలీసు అధికారులు ఇతర పరిపాలనా విభాగ అధికారులు బదిలీ కావడం మామూలే,కానీ ఈసారి తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈసీ ఇచ్చిన షాక్ మామూలుగా లేదు.సడన్గా కఠిన చర్యలకు దిగిన ఈసీ ఇక పై డబ్బు ప్రలోభాలను చూపించే నాయకులకు చుక్కలు చూపించబోతోంది.
అంతా హుజురాబాద్ ఉప ఎన్నికల ఎఫెక్ట్..?
తెలంగాణలో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది… వందల కోట్లు ఖర్చు చేశారంటూ ప్రచారం జరగడంతో అంతా అవాక్కయ్యారు.ఒక్క ఉప ఎన్నిక కోసం అన్నన్ని కోట్లు ఖర్చు చేయడమా!!! అని కేంద్ర స్థాయిలో ఉన్న పలువురు అధికారులు సైతం ఆశ్చర్యపోయారట.ఈ వైఖరి ఇలాగే కొనసాగితే ఎన్నికలంటేనే డబ్బు అనే వాదన దేశవ్యాప్తంగా ప్రబలుతుందని.దీంతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపడం కఠిన తరం అవుతుందని నివేదికను సిద్ధం చేశారు.వీటిని పరిశీలించిన ఈసీ ఈసారి ఎన్నికలకు చాలా ముందుగానే ప్రిపేర్ అయింది.ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉన్నతాధికారులను సైతం ఎన్నికల నిర్వహణకు దూరంగా ఉంచింది.దీంతో మిగతా అధికారులు కాస్త కంట్రోల్ లోకి వచ్చారు.ఏకంగా సిపి,సీనియర్ ఐఏఎస్ లాంటి పోలీసు ఉన్నతాధికారులను వెంటనే విధులకు దూరంగా ఉంచడంతో ఈసారి ఎన్నికలు దొంగ నాయకులకు అంత ఆషామాషీ కాదని అర్థమయ్యేలా చేసింది.అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్ట్ లు పెట్టి కోట్లలో సొమ్మును దొరక పట్టగలిగింది. దీంతో డబ్బుని నమ్ముకున్న నాయకులకు సీన్ కాస్త అర్థమైంది.
ఇక దబిడి దిబిడే..!
ఇప్పటివరకు ఒక ఎత్తు… ఇకపై ఒక ఎత్తు అనేలా మరింత కఠిన చర్యలకు ఈసీ దిగబోతోంది… గత ఎన్నికల కంటే ఏకంగా రెండు రెట్లు బలగాలను రంగంలోకి దింపబోతోంది.
పోయిన ఎన్నికల్లో 40,000 మంది పోలీసులు బందోబస్తులో దిగగా ఈసారి 75 నుండి 80 వేల పోలీసులను మోహరించనుంది.ఇక కీలక ఇంటలిజెన్స్ విభాగాలకు చెందిన మెరి కల్లాంటి అధికారులను సైతం ఇప్పటికీ రంగంలోకి దింపి అవినీతి నాయకుల చిట్టాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా పలువురు నేతల అక్రమ వ్యవహారాలు ఇప్పటికే ఇంటెలిజెన్స్ దృష్టిలో ఉన్నట్లు తెలుస్తోంది.ఎన్నికల సమయంలో డబ్బుల పంపిణీ ఎలా చేయాలని ప్లాన్ చేస్తున్న నాయకులకు అధికారులు ఈసారి షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
అవినీతి ఎన్నికలు ప్రమాదకరం ..?
నిజానికి ప్రజాస్వామ్యంలో ఎన్నికల విషయంలో డబ్బు పాత్ర చాలా స్వల్పం.గతంలో ఎన్నికల ముందు పార్టీలు కానీ నేతలు కానీ తాము ఏరకంగా తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామో ప్రజలకు వివరించేవారు.దీంతో అప్పట్లో పలువురు ఉన్నత విద్యాధికులు రాజకీయాల వైపు మొగ్గి గొప్పగా రాణించారు.. కానీ ప్రస్తుతం రాజకీయాలంటేనే డబ్బుమయం కావడంతో ఆర్థిక బలమే ముఖ్యమనే భావన కాస్త విలువలు ఉన్న నాయకులను రాజకీయాలకు దూరంగా ఉంచుతోంది.ఈ వ్యవస్థ మారాలని ఎప్పటినుంచో మేధావులు మొత్తుకుంటున్న ఎలాంటి మార్పు లేదు.కానీ ఈసీ తీసుకుంటున్న కఠిన చర్యలు చూసి ఈసారైనా ఎన్నికలంటే కాస్త డిఫరెంట్ అనే విషయం ప్రజల్లోకి వెళితే అదే పదివేలు.
By ఎన్.మల్లేష్ ( వార్త ).