మంత్రి గారి ఇలాకాలో మహిళా నేత హల్‌చల్!
- ఎన్నికల వేళ విచిత్ర పరిస్థితులు.
- అన్నీ తానే అంటూ అధిక పెత్తనం.
- ఎదురించిన వారికి ముప్పతిప్పలు.
- కింది స్థాయి నాయకులకు చుక్కలు చూపిస్తున్న మహిళా నేత.
- అ‘సంతోషం’లో మంత్రి అభిమానులు.
- కట్టడి చేయకుంటే ఫలితం..‘శేషం’ సున్నానే అంటున్న వైనం.
- ఇటీవల వ్యతిరేకుల రహస్య సమావేశం.
అది హైదరాబాద్ మహానగరంలో కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ ఓ మంత్రిగారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనంటే కింది స్థాయి నేతలు, కార్యకర్తలు, ఇరుగుపొరుగు వారికి ఎంతో గౌరవం..అభిమానం కూడా. అయితే ఇప్పుడు ఈ నేతలు, కార్యకర్తలకు ఓ పెద్ద చిక్కొచ్చి పడింది. మంత్రిగారి వద్ద ఎంతో నమ్మకంగా పనిచేస్తన్నట్లు బిల్డప్ ఇస్తున్న ఓ మహిళా నేత తీరు అందరికీ తలనొప్పిగా మారింది. మంత్రిగారు ఆమెకు కాస్త ప్రాధాన్యం ఇవ్వడంతో..ఇక పెత్తనం అంతా ఆమె…ఆమె కుమారుడే తీసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె తీరు దేవుడు వరమిచ్చినా…పూజారి అడ్డుకున్నాడనే తీరుగా ఉందని అంటున్నారు. మంత్రి గారు మా విషయంలో బాగానే స్పందిస్తారనుకుంటే..మధ్యలో ఈ మహిళా నేత అడ్డుకుంటోందని..అంతా ఆమె అన్నట్లుగా వ్యవహరిస్తూ తమకు..మంత్రికి మధ్య అగాథం సృష్టిస్తోందని వారు వాపోతున్నారు. మంత్రిగా ఉన్న సీనియర్ నేత వద్ద వినయ విధేయతలు నటిస్తూ పార్టీకి డ్యామేజ్ అవుతున్నా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇన్నిరోజులు ఆమె ఆగడాలను భరించినా…ఇప్పుడు ఎన్నికల సమయం అయినందున తీరు మారకపోతే మొదటికే మోసం వస్తుందని కిందిస్థాయి నేతలు అంటున్నారు. ఇక తిరగబడి..మంత్రి దృష్టికి ఈమె వ్యవహారాన్ని తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను అర్జంటుగా కట్టడి చేయకపోతే చివరకు నియోజకవర్గంలో ఫలితం కాస్తా.. ‘శేషం’ సున్నాగా అవుతుందని అంటున్నారు.
వ్యతిరేకుల రహస్య సమావేశం.
కాగా మహిళా నేత బాధితులంతా కలిసి సెపరేట్ వర్గంగా ఏర్పడ్డారని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరంతా కలిసి ఇటీవల ఓ చోట రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆమె వ్యవహార శైలి గురించి…ఆమె కుమారుడు తమ ’సంతోషాన్ని’ పర్మినెంట్‌గా దూరం చేసిన విషయం మంత్రికి ఎలా చెప్పాలోనని చర్చించారట. గతంలో ఆమె విషయం మంత్రి వద్ద ప్రస్తావించిన నేతలను సదరు తల్లీ కొడుకులు వేధించడంతో..ఈసారి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారట. నేరుగా తమ కష్టాలను మంత్రికి వివరించాలని, వారిలో మార్పు రాకపోతే ఇతర పార్టీ నేతలకు సహకరించాలనీ ఒక దశలో చర్చించారట. ఇదే జరిగితే ఎన్నికల వేళ మంత్రికి తలనొప్పి పెరిగినట్లే.
కష్టాలు ఇలా…
ఇంతకీ ఈ మహిళా నేత..ఆమె కుమారుడు చేస్తున్న ఘనకార్యాలేంటని ఆరా తీస్తే..కార్యకర్తలు కొందరు విస్తుపోయే నిజాలు చెబుతున్నారు. మంత్రి గెలుపుకోసం కష్టపడుతున్నట్లు చేస్తూ…ఎన్నికల వ్యవహారాల్లో ఎవ్వరినీ తలదూర్చన్విడం లేదట. ఇక ఆర్థిక లావాదేవీలు సరేసరి. అన్ని రకాలుగా పార్టీ కోసం తానే కష్టపడుతున్నట్లు బిల్డప్ ఇస్తూ కార్యకర్తలను పట్టించుకోవడం లేదట. కనీసం చిన్న చిన్న ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదట. ఇక తనకు వంత పాడే కొద్ది మంది అనుచరులపైనే పూర్తిగా ఆధారపడుతూ అసలైన నేతలు, కార్యకర్తలను పూర్తిగా విస్మరిస్తున్నారట. దీంతో ఇతర నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల సమయంలో అన్ని కాలనీలు, సంఘాలను కలుపుకొనిపోయి..సమన్వయం చేయాల్సిన పరిస్థితుల్లో నేతలను విస్మరిస్తే ఓట్లు పడడం కష్టమేనని స్థానికులు చర్చించుకుంటున్నారు.
గడ్డుకాలంలోనూ మారకుంటే కష్టమే…
అసలే నియోజకవర్గంలో ప్రతిపక్షాలు బలపడి..పార్టీ గడ్డు కాలం ఎదుర్కొంటున్న ఈ సమయంలో ఆ మహిళా నేత వ్యవహార శైలి వల్ల మంత్రికి రాజకీయంగా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నేతలు అంటున్నారు. అయినా తామేమి చేసే పరిస్థితుల్లో లేమని ఆ నియోజకవర్గ నేతలు లోలోపల మథన పడుతున్నారట. ఏది ఏమైనా ఎన్నికలకు ఇంకో 25 రోజులు సమయం మిగిలి ఉన్న తరుణంలో ఆమెను కట్టడి చేయకుంటే సమస్యలు తప్పవని సమాచారం.
By ఎన్.మల్లేష్ ( వార్త ).