రాసేద్దాం…వేసేద్దాం…!!!

రాసేద్దాం…వేసేద్దాం…!!!

రేవంత్‌పై ‘పింక్‌ మీడియా’ కుట్ర!

  • పాలనలో విఫలమైనట్లు విపరీత ప్రచారం.
  • పథకం ప్రకారం కథనాల సృష్టి.
  • అటు కాంగ్రెస్‌ నేతల్లో గందరగోళం..ఇటు రేవంత్‌ను టార్గెట్‌ చేయడమే లక్ష్యంగా ఎజెండా.
  • ప్రతిపక్ష నేతలతో కుమ్మక్కై రెచ్చిపోతున్న ‘పింక్‌ మీడియా’.
  • పదేళ్ల కేసీఆర్‌ వైఫల్యాలు, హామీలను ఎండగట్టని ఆ చానళ్లు..పత్రికలు
  • నాలుగు నెలల రేవంత్‌ పాలనపై మాత్రం దుమ్మెత్తిపోస్తున్న వైనం.
  • ఇదంతా ‘పథకం ప్రకారం కుట్ర’ అని భావన.

ప్రత్యేక పరిస్థితిలో..ఎన్నో అవరోధాలను అధిగమించి..పార్టీ పెద్దలను మెప్పించి..సంచలన సీఎంగా పీఠమెక్కి..తనదైన శైలితో ముందుకు వెళ్తూ…తన పార్టీ ఇచ్చిన హామీలన్ని నెరవేర్చేందుకు శాయశక్తులా పోరాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఓ వర్గం మీడియా కుట్ర చేస్తోందా…ఉచిత బస్సు ప్రయాణంతో హిట్‌కొట్టి..కొత్త ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టి..ఉచిత కరెంటు..గ్యాస్‌ సబ్సిడీ కొంత మేర అందిస్తూ ‘కొత్తవాడైనా..గట్టివాడే’ అన్పించుకుంటున్న రేవంత్‌ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రతిపక్ష నేతలు ఓ వర్గం మీడియా సహకారం తీసుకుంటున్నారా అంటే.. అవుననే అంటున్నారు పరిశీలకులు.


గత కొద్ది రోజులుగా ఓ వర్గం మీడియా ఏమీ ఎరగనట్లుగా వ్యవహరిస్తూనే సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తున్నాయి. ఆయన ఏం మాట్లాడినా వివాదాస్పదం చేస్తున్నాయి. బహిరంగ సభల్లో రేవంత్‌ మాట్లాడిన మాటల్లో అసలు విషయాలను మరుగునపెడుతూ…అందులో వివాదానికి ఏది పనికొస్తుందా అని వెదికి మరీ హెడ్డింగులు పెడుతూ రెచ్చగొడుతున్నాయి. ఇక రేవంత్‌ పని అయిపోయిందని…పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరతారని, ఆయనను అధిష్టానం సీఎం పీఠంపై నుంచి తప్పిస్తుందంటూ దారుణమైన కథనాలు అల్లుతున్నాయి. ఇవే మాటలు యథావిధిగా ప్రతిపక్ష నేతలు బహిరంగ సభా వేదికలపై మాట్లాడుతున్నారు. వాటినే లీడ్‌ స్టోరీలుగా వేస్తున్నాయి.

ఆ చానళ్ల రూటే వేరు :

పత్రికలతో పాటు కొన్ని టీవీ చానళ్లు రేవంత్‌ను దారుణంగా టార్గెట్‌ చేశాయి. పదేళ్లు పాలించి..ఓటమి చెందిన బీఆర్‌ఎస్‌ను సమర్థిస్తున్నాయి. పదేళ్ల పాటు పాలించిన కేసీఆర్‌ ఎన్నో హామీలను తుంగలో తొక్కారు. దళితుడ్ని సీఎం చేస్తామని చెప్పిన కాడి నుంచి…ఉద్యోగాల భర్తీ..ఫీజు రీయింబర్స్‌మెంట్‌..విద్యాభివృద్ధి వంటి ఎన్నో పథకాలను బీఆర్‌ఎస్‌ విస్మరించింది. మరి ఆ కాలంలో ఈ విషయాలను ఏమాత్రం ప్రస్తావించని సదరు టీవీ చానళ్లు ఇప్పుడు..సీఎం రేవంత్‌ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా కాకుండానే ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నాయి. డిబేట్లు‍ పెట్టి మరీ ఆయన పాలనలో విఫలమైనట్లు బిల్డప్‌ ఇస్తున్నాయి. కొన్ని పత్రికలు ఇదే అజెండాతో పతాక శీర్షికలతో వార్తలు ప్రచురిస్తున్నాయి.

ఎందుకీ అక్కసు? :

ప్రజల ఆదరణతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో కొంత మేలు చేస్తుందని ప్రజలు భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీల అమలుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఒక్కొక్క గ్యారంటీని విడతలవారీగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హిట్టయింది. అలాగే కరెంటు బిల్లులు మాఫీ కావడం, గ్యాస్‌ బిల్లులో రూ.500 సబ్సిడీ ఇవ్వడం మొదలైంది. ఇవన్నీ మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తున్నాయి. ప్రతి ఇంట్లో ఏదో ఓ రకంగా ఈ లబ్ధి చేకూరడంతో కాంగ్రెస్‌కు మైలేజీ వస్తోంది. ముఖ్యంగా సంచలనాల మధ్య సీఎం అయిన రేవంత్‌రెడ్డికి క్రేజ్‌ పెరుగుతోంది. ఇటు సొంత పార్టీలోని సీనియర్లను, అటు ఢిల్లీ పెద్దలను..అస్తవ్యస్థమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొని తనదైన శైలిలో పాలనకు శ్రీకారం చుట్టిన రేవంత్‌రెడ్డిపై నమ‍్మకం పెరుగుతోంది. దీంతో పదేళ్లపాటు పాలించిన బీఆర్‌ఎస్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కవిత అరెస్టుతో ఆ పార్టీలో వణుకు పుడుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ఆయన దూకుడుకు కళ్ళెం వేయాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారట. ఇందుకు ఆయన తనకు పదేళ్లపాటు వెన్నంటి ఉన్న కొన్ని చానళ్లు, పత్రికల సహకారం కోరారట. ఎన్ని కోట్లయినా కుమ్మరిస్తా..మీరు మాత్రం రేవంత్‌ను అస్థిరపరిచేలా..పాలనలో విఫలమైనట్లు ప్రచారం చేయాలని కోరారట. తప్పుడు కథనాలకూ వెనకాడొద్దని, కాంగ్రెస్‌ నేతల మధ్య చిచ్చుపెట్టాలని సూచించారట. దీంతోనే ‘పింక్‌ మీడియా’ రెచ్చిపోతోందని తెలుస్తోంది.

మంత్రుల మధ్యనే చిచ్చుపెట్టేలా:

చివరకు చర్చల పేరుతో డిబేట్లకు పిలిచి..మంత్రుల మధ్యనే చిచ్చుపెట్టేందుకు ఈ మీడియా పెద్దలు ప్రయత్నిస్తునారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఓ చానల్‌లో డిబేట్ల పేరిట డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డిల మధ్య గొడవ సృష్టించేలా ప్రయత్నం జరిగింది. కానీ వారు ఎవరికి వారు అర్థం చేసుకుని పింక్‌ మీడియా కుట్రకు చెక్‌ పెట్టారు. జరుగుతున్న అభివృద్ధిపై ఓ వర్గం మీడియా అస్సలు ఫోకస్‌ చేయకుండా…కేవలం నెగటివిటీనే తమ పంథాగా మార్చుకున్నాయి. ప్రతిపక్ష వార్తలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి.

కేసీఆర్‌ కోసమేనా ఇదంతా:

కాంగ్రెస్‌ పార్టీ నేతలే సీఎంను విమర్శించేలా రెచ్చగొట్టడంలోనూ కొన్ని చానళ్లు, పత్రికలు ముందున్నాయి. పక్కా ప్లాన్‌ ప్రకారం డిబేట్లకు పిలవడం..అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసి..చివరకు వాటిని రేవంత్‌రెడ్డికి ముడిపెట్టడం చేస్తూ వారిని ఇరుకున పడేస్తున్నారు కొందరు జర్నలిస్టులు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేలా చేస్తున్నారు. చివరకు ప్రతిపక్ష నేతలు అడగాల్సిన ప్రశ్నలను జర్నలిస్టులే సంధిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. ఇదంతా కేసీఆర్‌ కోసమే ‘పింక్‌ మీడియా’ ఆడుతున్న డ్రామా అని విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రజాదరణ ఉన్న చానళ్లు, పత్రికలను మాజీ సీఎం కేసీఆర్‌ మచ్చిక చేసుకుని ఈ డ్రామాలు ఆడిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి తప్పుడు వ్యవహారాల వల్ల అటు ప్రజలకు నష్టం కలగడమే కాకుండా..మీడియాపై ప్రజలకు నమ్మకం పోతుందని పరిశీలకులు అంటున్నారు. ప్రజల ఆదరణతో పీఠమెక్కిన సర్కారుపై అకారణంగా దుమ్మెత్తిపోయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని వారు హితవు పలుకుతున్నారు.

By ఎన్.మల్లేష్ ( వార్త ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *