సూర్య 'కంగువ' కోసం ప్రభాస్‌, గోపీచంద్‌... ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఏర్పాట్లు షురూ

సూర్య హీరోగా దిశా పటానీ హీరోయిన్‌గా భారీ బడ్జెట్‌తో శివ దర్శకత్వంలో రూపొందిన కంగువ సినిమా నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి చాలా రోజులు అయింది. దసరాకి సినిమాను విడుదల చేయాలని భావించినా ఆ సమయంలో రజినీకాంత్‌ వేట్టయన్ సినిమా విడుదల కావడంతో కంగువ వాయిదా వేశారు. ఇక మరో రెండు వారాల్లో విడుదల కాబోతున్న కంగువ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే సూర్యతో పాటు ఇతర యూనిట్‌ సభ్యులు బిగ్‌బాస్ తో పాటు పలు కార్యక్రమాల్లో, మీడియా సమావేశాల్లో పాల్గొని సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇక నవంబర్‌ 7 లేదా 8వ తేదీన హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యులుగా ఉన్న కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కి ప్రభాస్ చీఫ్ గెస్టుగా వచ్చే అవకాశం ఉందని టాక్. ప్రభాస్‌ హోం బ్యానర్‌ అయిన యూవీ క్రియేషన్స్‌ మొదటి తమిళ్ వెంచర్‌ అవ్వడంతో అందరిలోనూ అంచనాలు ఉన్నాయి. అందుకే ప్రభాస్ సైతం ఈ సినిమాకు తనవంతు సహకారం అందించే అవకాశాలు ఉన్నాయి. షూటింగ్‌ తో బిజీగా ఉన్నప్పటికీ కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరు అవ్వాలని ప్రభాస్ అనుకుంటున్నారట.

ప్రభాస్‌తో పాటు గోపీచంద్‌ సైతం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. గోపీచంద్‌ హీరోగా గతంలో వచ్చిన శౌర్యం, శంఖం సినిమాలకు శివ దర్శకత్వం వహించారు. ఇప్పుడు అదే శివ దర్శకత్వంలో కంగువ సినిమా రూపొందింది. శివతో ఉన్న సాన్నిహిత్యంతో గోపీచంద్‌ 'కంగువ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్‌తో పాటు యూవీ క్రియేషన్స్ నిర్మాతలతో హీరో గోపీచంద్‌ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగానైనా కంగువ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గోపీచంద్‌ పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే అభిప్రాయం మీడియా సర్కిల్స్‌లో వ్యక్తం అవుతోంది.