పోలీస్‌ ‘అమ్మ’కు ఆసరా ఇవ్వరూ…

పోలీస్‌ ‘అమ్మ’కు ఆసరా ఇవ్వరూ…

  • గర్భిణులైన మహిళా పోలీసులకు విధి నిర్వహణలో సవాళ్లు.
  • వేసవిలో డ్యూటీలతో ఇబ్బందులు.
  • ఇటీవల గర్భస్రావానికి గురైన కొందరు ఉద్యోగినులు.
  • మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని వినతి.
  • కాస్త సులభతరమైన విధులు కేటాయించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి.

పోలీస్‌ శాఖలో ఉద్యోగమంటేనే ఓ సవాల్‌. అందునా..మహిళలకు ఈ శాఖలో ఉద్యోగం చేయడమంటే ఆషామాషీ కాదు. ఇక పోలీస్‌ ఉద్యోగం చేస్తూ గర్భం దాల్చిన మహిళల పాట్లు అన్నీ ఇన్నీ కాదు. శారీరకంగా, మానసికంగా కాస్త శ్రమ ఎక్కువ ఉండే పోలీస్‌ విభాగంలో మహిళా కానిస్టేబుళ్లు, హోం గార్డులు ఎంతో మంది పనిచేస్తున్నారు. వీరిలో గర్భం దాల్చిన వారు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల్లో, బహిరంగ ప్రదేశాలు, జనసమ‍్మర్థం ఎక్కువ ఉన్న ప్రాంతాలు, బహిరంగ సభల వద్ద, బందోబస్తు డ్యూటీలు చేయడం గర్భిణులైన ఉద్యోగులకు కత్తిమీద సాములా మారింది. వాస్తవంగా వీరికి గర్భం దాల్చిన తర్వాత ప్రసవానికి మూడు నెలల ముందు..ఆ తర్వాత మరో మూడు నెలలు మెటర్నటి లీవ్‌ లభిస్తుంది. కానీ మొదటి ఆరు నెలలు డ్యూటీ చేయాల్సిందే. పోలీస్‌ నిబంధనల మేరకే వీరికి అధికారులు డ్యూటీలు కేటాయిస్తున్నారు. ఇందులో అధికారులను, పోలీస్‌ నిబంధనలను తప్పు పట్టాల్సిన పనిలేదు. కానీ..కాస్త మానవతా దృక్పథంతో ఆలోచించి గర్భిణులకు డ్యూటీల కేటాయింపులో కొంత వెసులుబాటు కల్పించాలని వారు కోరుతున్నారు. ఆరోగ్య రీత్యా కఠినమైన డ్యూటీలు కాకుండా స్టేషన్‌లో లేదా కాస్త నీడపట్టున ఉండేలా డ్యూటీలు వేస్తే తల్లీ బిడ్డలకు క్షేమమని వారు భావిస్తున్నారు.

ఎండలో డ్యూటీ చేస్తూ..గర్భస్రావానికి గురై:

ఇటీవల ఓ జోన్‌లో గర్భిణి అయిన ఓ మహిళా కానిస్టేబుల్‌ ఎండలో డ్యూటీ చేయాల్సి వచ్చింది. దీంతో ఆమె వడదెబ్బకు గురై అనారోగ్యం పాలైంది. వెంటనే ఆమెకు గర్భస్రావం జరిగింది. ఇది ఆమె జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సంతానం కోసం ఆమె కన్న కలలు కల్లలు కావడంతో తీవ్ర వేదనకు గురైంది. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో పోలీస్‌ ఉన్నతాధికారులు కాస్త కనికరం చూపాలని…గర్భిణులైన మహిళా కానిస్టేబుళ్లకు సులభతరమైన డ్యూటీలు వేయాలని వారు వేడుకుంటున్నారు.

మంచినీళ్లు సైతం అందక :

ఇక డ్యూటీలో ఉండగా…వీరికి కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో ఉండని పరిస్థితులు ఎదురవుతాయి. వాస్తవంగా గర్భిణిలు మొదటి ఆరు నెలలు మంచి ఆహారం, నీరు తీసుకోవాలి. కానీ విధుల కారణంగా వీరికి కష్టతరమవుతోంది. ఇటు ఉద్యోగం తప్పదు..అటు ఆరోగ్యం కాపాడుకోవడం తప్పదు. ఈ నేపథ్యంలో ‍మహిళా కానిస్టేబుళ్లు ఒత్తిడికి గురవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గర్భిణులైన ఉద్యోగుల విషయంలో కొన్ని సౌకర్యాలు కల్పిస్తే బావుంటుందని వారి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

By ఎన్.మల్లేష్ ( వార్త ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *