చక్రవ్యూహంలో రేవంత్‌

చక్రవ్యూహంలో రేవంత్‌

  • పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గట్టెక్కించేనా..
  • వేధిస్తున్న ప్రతికూలతలు.
  • సొంత పార్టీలో స్వేచ్ఛ లేక..స్వేచ్ఛగా వ్యవహరించలేక ఇబ్బందులు.
  • ఇటు కేసీఆర్‌ అనుకూల మీడియా..అటు ప్రతిపక్ష నేతల దుప్ప్రచారం.
  • అందువల్లే లోక్‌సభ రేసులో వెనుకంజ.
  • అయినా..గెలుపుపై ఆశలు.
  • రహస్య వ్యూహాలతో ముందడుగు వేస్తారంటున్న పరిశీలకులు.

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు తెర వేసి..తెలంగాణలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేసి..అందర్నీ ఆశ్చర్యపరిచేలా సీఎం పదవి చేపట్టిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు అనూహ్య పరీక్షను ఎదుర్కోబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి..పోరాడి అధికారానికి అవసరమైన ఎమ్మెల్యే సీట్లు గెలిచిన ఆయన..ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రం కొంత అననుకూల..ప్రతికూల..ఊహాజనిత పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో అధికారం సాధించినందున…లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కాస్త అనుకూలమైన అంశం. ఈ అనుకూల పరిస్థితులను సానుకూలంగా మల్చుకొని తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ దాదాపు 12 నుంచి 13 సీట్లు సాధిస్తుందని మొదట్లో అందరూ అంచనా వేశారు. కనీసం 11 సీట్లు పక్కా అనుకున్నారు. కానీ ప్రస్తుతం సీన్‌ మారుతోందా…అంటే కొంత గందరగోళ పరిస్థితి అయితే ఉంది.

సర్వేల్లో వెనుకంజ:

తాజాగా జరిగిన సర్వేలు, అంచనాల్లో కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో అంత అనుకూల పరిస్థితి లేదని వెల్లడైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న ఊపు అప్పుడే తగ్గిందంటున్నారు. అనూహ్యంగా ఈ సారి బీజేపీకి ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయని అంచనా వేస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు ఆదరణ బాగా తగ్గిన నేపథ్యంలో వారి ఓటు బ్యాంకును పూర్తిగా కాంగ్రెస్‌ మల్చుకుంటుందని భావించారు. కానీ కాంగ్రెస్‌ గ్రాఫ్‌ కాస్త తగ్గడంతో ఆ ఓటు బ్యాంకులో ఎక్కువ షేర్‌ బీజేపీ వైపు మళ్లిందని అంటున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం తెలంగాణలోని 17 లోక్‌ సభ సీట్లలో 8 నుంచి 10 కాంగ్రెస్‌కు, 5 నుంచి 7 బీజేపీకి, ఒకటి లేదా రెండు సీట్లు బీఆర్‌ఎస్‌కు రావొచ్చంటున్నారు. ఇదే జరిగితే కాంగ్రెస్ అధిష్టానం కంగుతింటుందని చెప్పొచ్చు.

అసలెందుకిలా:

తన వాగ్ధాటి..దూకుడు శైలి..కేసీఆర్‌పై ఎటాకింగ్‌ స్పీచ్‌లతో రాజకీయ తెరపై అత్యల‍్ప కాలంలోనే ఉన్నత స్థానానికి చేరి..కాంగ్రెస్‌ను అధికార పీఠం ఎక్కించిన రేవంత్‌రెడ్డి..అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే డీలా పడ్డారా..పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ దూకుడు తగ్గించారా..అంటే అవుననే అన్పిస్తోంది. జాతీయ పార్టీ అయినందున కాంగ్రెస్‌లో రేవంత్‌కు స్వేచ్ఛ లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ పెద‍్దలపై ఆధారపడాల్సిందే. వారు చెప్పినట్లు వినాల్సిందే. దీనికి తోడు తెలంగాణలో కాకలుతీరిన సీనియర్‌ నేతలు పదుల సంఖ్యలో ఉండడంతో వారిని సమన్వయం చేసుకుంటూ పాలన సాగించడం రేవంత్‌కు కత్తిమీద సాములా మారింది. దీనికి తోడు రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన పాలనను గాడిన పెట్టడం..దయనీయంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం మరింత క్లిష్టంగా మారింది. అటు ఢిల్లీ పెద్దలు..ఇటు సీనియర్‌ నేతలు..మరోవైపు ప్రతిపక్షాల దాడి…దిగజారిన ఆర్థిక పరిస్థితులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహకంలో రేవంత్‌ కాస్త వెనుకబడ్డారన్న వాదన విన్పిస్తోంది. ఇక పార‍్లమెంట్‌ అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించి పై చేయి సాధించాలని రేవంత్‌ యత్నించినా..కాంగ్రెస్‌లో పరిస్థితులు ఆయనకు అనుకూలించలేదు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ స్వేచ్ఛగా వ్యవహరించడం రేవంత్‌ వంటి నేతలకు కాస్త కష్టమే. ఈ కారణంగానే ఆయన అభ్యర్థుల ఎంపికలో కాస్త తడబడ్డారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారమూ ఆలస్యమే అయింది. ఇన్ని ప్రతికూలతల మధ్య రేవంత్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

మరోవైపు ప్రతిపక్ష నేతలు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు, బండి సంజయ్‌లు రేవంత్‌ టార్గెట్‌గానే విమర్శలు గుప్పిస్తున్నారు. అయన ఎక్కువ కాలం సీఎంగా ఉండలేరని అడ్డంగా వాదనలు చేస్తున్నారు. రేవంత్‌ను అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి వారు కేసీఆర్‌ అనుకూల మీడియాను వాడుకుంటున్నారు. రెండు మూడు టీవీ చానళ్లు, రెండు మూడు పత్రికలు ఏకంగా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు స్పీచ్‌లనే హైలైట్‌ చేస్తూ రేవంత్‌ పాలనలో విఫలమైనట్లు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య రేవంత్‌రెడ్డి పార్లమెంట్‌ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఇక సీనియర్లు ఉన్నప్పటికీ ప్రచార పర్వంలో రేవంత్‌ ఒక్కడే స్టార్‌ క్యాంపెయినర్‌గా వెలుగొందుతున్నారు. తన దుందుడుకు స్పీచ్‌లతో ప్రజలను ఆకట్టుకోవడంలో రేవంత్‌ దిట్ట. అందుకే అభ్యర్థులు సైతం రేవంత్‌రెడ్డినే తమ ప్రచారకర్తగా భావిస్తున్నారు. అయినా భట్టి, ఉత్తమ్‌, కోమటిరెడ్డి, పొంగులేటి వంటి నేతలతో సమన్వయం చేస్తూ రేవంత్‌ కాంగ్రెస్‌ను గట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయినా రేవంత్‌ గెలుస్తాడేమో :

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ సైలెంట్‌ కిల్లర్‌ అంటుంటారు ఆయనను బాగా ఎరిగిన సన్నిహితులు. పైకి కన్పించే రేవంత్‌ వేరు..వ్యూహాలు పన్నుతూ..ప్రత్యర్థులను చిత్తుచేస్తూ అనుకున్న లక్ష్యాలను చేరుకునే రేవంత్‌ వేరు అని వారు చెబుతారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లోనూ సీఎం రేవంత్‌రెడ్డి ఏదైనా రహస్య వ్యూహంతో ముందుకు వెళ్తున్నారేమో. అందుకే ఆయన ఇటీవల ఊపందుకున‍్న బహిరంగ సభల్లో విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు 15 సీట్లు గ్యారంటీ అని ఘంటా పథంగా చెబుతున్నారు. ఏది ఏమైనా రేవంత్‌రెడ్డి ఇప్పుడున్న రాజకీయాల్లో ఓ కింగ్‌ మేకరే అని చెప్పొచ్చు.

By ఎన్.మల్లేష్ ( వార్త ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *