మాగంటి….ఇదేంటి?

మాగంటి….ఇదేంటి..?

  • చెలరేగుతున్న అనుచరులు.
  • ఆగడాలపై మండిపడుతున్న జనం.
  • వరుస వివాదాలతో మనుగడకే ముప్పు.
  • తాజా వీడియోతో దేశవ్యాప్తంగా చర్చ.
  • ఎన్నికల వేళ ఎన్నో తలనొప్పులు.

అసలే ఎన్నికల సమయం,హైదరాబాద్ మహానగరంలోని కీలక నియోజకవర్గం. ఇక్కడ ఏం జరిగిన,చీమ చిటుక్కుమన్నాక్షణాల్లో రాష్ట్రమంతటా తెలిసిపోతుంది. వీఐపీ నియోజకవర్గంగా పేరొందిన జూబ్లీహిల్స్‌లో పరిస్థితి ఇదీ. ఈ తరుణంలో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అనుచరుల వ్యవహార శైలి ఆయనకి తల నొప్పులు తెచ్చేలా ఉంది. వారి దూకుడుతో రోజుకో ఘటన జరుగుతుండగా,ఎమ్మెల్యే ప్రతిష్ట దెబ్బతింటోంది. అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా వ్యవహరిస్తూ మాగంటే స్వయంగా నేరగాళ్లను ప్రోత్సహిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో మాగంటి గురించి దేశం మొత్తం చర్చించుకునే స్థాయిలో వైరల్ అయినట్టు తెలుస్తుంది.

ఇదీ సంగతి..!

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు కీలక అనుచరుడుగా పేరొందిన ఓ వ్యక్తి తన గ్యాంగ్‌తో కలిసి ఓ గుర్తు తెలియని వ్యక్తిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టారు. తనను వదిలేయాలంటూ కాళ్లు పట్టుకొని వేడుకున్నా కూడా పట్టించుకోకుండా..మరింత దారుణంగా మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధ సంఘటన లెవెల్లో జరిగిన ఈ దారుణాన్ని నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. తప్పు ఎవరిదైనా..ఒక మనిషిని అంత్యంత అమానుషంగా కొట్టిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అధికారం అడ్డు పెట్టుకొని ప్రజాప్రతినిధులు తమ అనుచరులను ఇలా తయారు చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

స్వయంగా ఆయనే అలా చేస్తే ఎలా..?

మొన్నటికి మొన్న ఎమ్మెల్యే మాగంటి ఫ్లెక్సీ విషయంలో ఏకంగా ఆయనే స్వయంగా ఓ ఇంట్లోకి దూరి ఒక వ్యక్తిపై దాడికి పాల్పడిన వీడియో పలు విమర్శలకు దారి తీసింది. ఆవేశంలో ఉన్న తమ అనుచరులను శాంతింపజేయాల్సిన ఎమ్మెల్యేనే..స్వయంగా దాడికి పాల్పడడం ఎంత వరకు సబబు అని పలువురు చర్చించుకున్నారు. ఇక ఆ ఘటనకి ముందు ఆయన అనుచరుడు విజయసింహ విశ్వరూపం గురించి మూడు రోజులు మీడియాలో కథనాలు వచ్చాయి. ఒక యువతిపై అత్యాచారం చేసి, హత్యాయత్నం చేసినట్టు జోరుగా ప్రచారం జరిగింది. ఆయన అనుచరుడు విజయసింహ రసవత్తర ఫోటోలు, చాటింగ్‌లు మాగంటికి తగులుకుని అయన ఇమేజ్‌ను తగ్గించే స్థాయికి చేరాయి. ఈ ఘటనలో నిజాలు ఎన్ని ఉన్నాయి అన్న విషయాన్ని పక్కనబెడితే..ఇలాంటి దుర్మార్గులు మా ఎమ్మెల్యే మాగంటి అనుచరులా అని నియోజకవర్గం ప్రజలు అనుకునేలా చేసింది ఆ ఘటన.

పోస్టింగ్‌ల కోసం ఒత్తిడి..!

ఆ తర్వాత అంతర్గతంగా తనకు నచ్చిన వారికి పోస్టింగ్స్ ఇవ్వాలి అంటూ మాగంటి పోలీస్ ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు పోలీస్ శాఖలో చర్చ జరిగింది. ఒక సీఐని విధుల్లో చేరాక కూడా తన పరపతిని ఉపయోగించి పది రోజుల్లో అతన్ని బదిలీ చేయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక గతంలో తను పోస్టింగ్ ఇప్పించుకున్న కొందరు సీఐలతో కొన్ని భూ సెటిల్మెంట్లు చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇవన్ని ఒక ఎత్తు ఐతే తన నియోజకవర్గంలో తన మాట వినని సొంత పార్టీ నేతలను పలు రకాలుగా తొక్కి పడేసినట్టు కూడా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయొద్దీన్‌ను కక్షగట్టి మరీ రాజకీయంగా అణగదొక్కినట్లు సొంత పార్టీ నేతలే చెబుతుంటారు. ఇలా ఒకటి కాదు..రెండు కాదు..ఎన్నో వరుస ఘటనలు మాగంటిని చిక్కుల్లో పడేసే పరిస్థితిని కల్పిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ…ఇప్పటికైనా మాగంటి మేల్కొని తన అనుచరులను అదుపులో పెట్టకపోతే ఆయన అందరికి ఇచ్చే వంటింటి గిఫ్టులు, ఎప్పుడూ జరిపించే స్వామి వారి కళ్యాణాలు కూడా ఆయన్ని కాపాడలేవని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

By ఎన్.మల్లేష్ ( వార్త ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *