కరోనా : సానియా మీర్జా భావోద్వేగం

కరోనా మహమ్మారి  ప్రపంచవ్యాప్తంగా ప్రతీ  ఒ‍క్కరినీ గడ గడలాడించింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎపుడు.. ఎక‍్కడనుంచి ఎలా వస్తుందో అనే భయం సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు వెంటాడింది. తాజాగా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కోవిడ్‌ అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కరోనా సోకి ఒంటరిగా, కుటుంబానికి, బిడ్డకు దూరంగా ఉండటం చాలా భయానకం అంటూ భావోద్వేగానికి  లోనయ్యారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా తాను కూడా కరోనా వైరస్‌ బారినపడ్డాననీ, కానీ ఆ దేవుడి దయ వల్ల ప్రస్తుతం తాను ఆరోగ్యంగా  ఉన్నానంటూ ఇన్‌స్టాలోను,  ట్విటర్‌లోనూ పోస్ట్‌  చేశారు. 

తనకి కరోనా పాజిటివ్ అని తేలినప్పటికీ.. అదృష్టవశాత్తూ తనకు ఎలాంటి లక్షణాలు కనిపించ లేదని సానియా మీర్జా ఇన్‌స్టాలో వెల్లడించారు. అయినా ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్‌లోనే ఉన్నానన్నారు. అయితే ఈ సమయంలో కుటుంబానికి, ముఖ్యంగా తన రెండేళ్ల చిన్నారికి దూరంగా ఉండటం చాలా భయంకరంగా అనిపించిందన్నారు. కానీ కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో ఒంటరిగా, కుటుంబానికి, ఆత్మీయులకు దూరంగా ఉన్న వారి పరిస‍్థితి  ఊహించడానికే కష్టం.

ఎపుడు ఏం జరుగుతుందో తెలియదు..రోజుకో లక్షణం.. రోజుకో కొత్త స్టోరీ… ఇలాంటి అనిశ్చితి పరిస్థితిని డీల్‌ చేయడం అటు శారీరంగానూ, ఇటు మానసికంగానూ చాలా కష్టం. అందుకే కరోనా మహమ్మారిని అసలు జోక్‌గా తీసుకోవద్దు. దీని పట్ల జాగ్రత్తగా ఉందాం. మాస్క్‌లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోడం ద్వారా మిమ్మల్ని మీ వాళ్లను కాపాడుకోండి. మన కుటుంబాన్ని రక్షించుకునేందుకు మనం చేయగలిగినదంతా చేయాలి.  కలిసికట్టుగా ఈ యుద్ధం చేస్తున్నామంటూ  సానియా పేర్కొన్నారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *