‘మత్తు’ కింగ్‌ రఘు ఎక్కడ?

    ‘మత్తు’ కింగ్‌ రఘు ఎక్కడ?

    • రాడిసన్‌ వ్యవహారంతో మళ్లీ తెరపైకి వెలగపూడి రఘుతేజ వ్యవహారాలు.
    • గతంలో ఇక్కడ పెద్ద ఎత్తున డ్రగ్స్‌ విక్రయించినట్లు ఆరోపణలు.
    • రూ.కోట్లు గడించి బెంగళూరులో సామ్రాజ‍్యం విస్తరణ.
    • అయినా..నగరంలో ఆయన మనుషులు ఇప్పటికీ ఉన్నట్లు అనుమానాలు.
    • రహస్య నెట్‌వర్క్‌తో రఘు ఆధ్వర్యంలో డ్రగ్స్‌ విక్రయాలు.
    • అనుమానిస్తున్న పోలీసులు..ఆ దిశగా దర్యాప్తు.

    నగరంలో మళ్లీ డ్రగ్స్‌ దందా తెరపైకి వచ్చింది. ఓ రాజకీయ పార్టీ నేత కుమారుడు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడడం కలకలం సృష్టించింది. ఇటు రాజకీయ వర్గాలు..అటు సినీ, సెలబ్రిటీ సర్కిళ్లలో డ్రగ్స్‌ తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. ఇక కొత్తగా అధికారం చేపట్టిన రేవంత్‌రెడ్డి సర్కారు కూడా రాష్ట్రంలో డ్రగ్స్‌తోపాటు గంజాయిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరోసారి డ్రగ్స్‌ విక్రేత వెలగపూడి రఘుతేజ అలియాస్‌ రఘు పేరు కూడా తెరపైకి వచ్చింది. గతంలో విచ్చలవిడిగా డ్రగ్స్‌ అమ్మినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న రఘు..ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. కానీ ఆయనకు ఇప్పటికీ ఇక్కడి వారితో డ్రగ్స్‌ లింక్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, రాజకీయ, మీడియా వర్గాలతో సన్నిహితంగా మెలిగి..యధేచ్ఛగా డ్రగ్స్‌ విక్రయించిన రఘు అప్పట్లో సంచలనం రేపాడు. కోట్లాది రూపాయలు ఆర్జించాడు. కబ్జాలు, మోసాలు, మాదక ద్రవ్యాల విక్రయాలతో కోట్లు గడించిన రఘు చివరకు పోలీసుల ఒత్తిడి పెరగడంతోనే తన సామ్రాజ్యాన్ని బెంగళూరుకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే..బెంగళూరులో ఉంటున్నా హైదరాబాద్‌తో ఆయనకు విడదీయలేని బంధం ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ విక్రయాల కోసం ఇక్కడ పెద్ద నెట్‌వర్క్‌నే విస్తరించాడని తెలుస్తోంది. ఆ నెట్‌వర్క్‌ ద్వారానే విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నాడని తెలిసింది.

    కట్టుదిట్టమైన చర్యలున్నా :

    వాస్తవంగా గత ఏడాది నుంచే హైదరాబాద్‌ నగరంలో డ్రగ్స్‌ విక్రయాలపై ఉక్కుపాదం మోపుతూ వస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగి కట్టుదిట్టంగా డ్రగ్స్‌ను నిరోధిస్తూ వస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాదకద్రవ్యాలు, గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీచేశారు. నగరాన్ని డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా మార్చాలని పేర్కొన్నారు. దానికి తగ్గట్లే పోలీసులు పెద్ద ఎత్తున దాడులు జరుపుతూ క్వింటాళ్ల కొద్ది గంజాయిని, మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు.ఇదిలా ఉండగానే…రాడిసన్‌ హోటల్‌లో ఓ రాజకీయ ప్రముఖుడి కుమారుడి ఆధ్వర్యంలో డ్రగ్స్‌ పార్టీ జరగడం.పోలీసులు దాడి చేసి అతన్ని పట్టుకోవడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.సీఎం ఆదేశాల మేరకు పోలీసులు ఇంత పకడ‍్బందీగా డ్రగ్స్‌ను అరికడుతున్నా,మళ్లీ డ్రగ్స్‌ పార్టీ ఎలా జరిగిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.దీని వెనుక డ్రగ్స్‌ దందాలో ఆరితేరిన రఘు హస్తం ఉందా అని అనుమానిస్తున్నారు. ఎంతో అనుభవంతో పాటు నగరంలో విస్తృత నెట్‌వర్క్‌ కలిగి ఉండడం..అనుచరగణం..పలుకుబడి..రాజకీయ అండదండలు ఉండడం వల్ల రఘు తేలికగానే ఇక్కడికి డ్రగ్స్‌ సరఫరా చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.ముఖ్యంగా ఒక టీవీచానల్‌ జర్నలిస్టుతో రఘుకు సత్ససంబంధాలు ఉన్నాయని అప్పట్లో పుకార్లు బాగా విన్పించాయి.ఆ రకమైన సపోర్ట్ పొందికూడా రఘు నగరంలో డ్రగ్స్‌ విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు.

    సమగ్ర విచారణ జరిపితే :

    డ్రగ్స్‌ కేసును సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ పోలీసులు దర్యాప్తును చేపట్టారు. అయితే రఘుతేజ వ్యవహారాలపై మరోసారి దృష్టిసారిస్తే వారికి ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు లభించే చాన్స్‌ ఉందంటున్నారు.అసలు రఘు నెట్‌వర్క్‌ ఎవరు,ఇక్కడ ఆయన వ్యవహారాలు చూస్తున్న వ్యక్తుల గురించి ఆరా తీసి సమగ్ర విచారణ జరిపితే డ్రగ్స్‌ కింగ్‌ రఘుతేజ గుట్టు రట్టు అయ్యే చాన్స్‌ ఉంది.అలాగే నగరంలో మత్తు పదార్థాల విక్రయాలకు అడ్డుకట్ట పడే చాన్స్‌ ఉందని అంటున్నారు.

    By ఎన్.మల్లేష్ ( వార్త ).

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *