అజహర్‌..పే నజర్‌ నహి!

అజహర్‌..పే నజర్‌ నహి!

  • జూబ్లీహిల్స్‌లో క్లీన్ బౌల్డ్ ఐయ్యే అవకాశం.
  • అజహర్‌ తీరుతో విసుగెత్తిన స్థానిక నేతలు, కేడర్‌.
  • కలుపుకొని పోవడంలో విఫలమవుతున్న క్రికెట్‌ స్టార్‌.
  • మైనార్టీ ఓట్లూ కష్టమే అంటున్న పరిశీలకులు.
  • సంపన్నుల ఇలాఖాలో కాంగ్రెస్‌ ఖాతా తెరవలేదంటున్న వైనం.

సంపన్నులకు నిలయమైమన జూబ్లీహిల్స్‌ సెగ్మెంట్‌లో రసవత్తర రాజకీయం నడుస్తుండగా,అకస్మాత్తుగా సీటు సాధించి.హడావుడిగా ఎన్నికల బరిలోకి దూకిన మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌కు ఎదురుగాలి వీస్తోంది.నియోజకవర్గం గురించి ఏమీ తెలియకపోవడం, నేతలను కలుపుకునే విధానం పాటించకపోవడం,ఒంటెద్దు పోకడలు,జనాకర్షక శక్తి లేకపోవడంతో జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. అసలే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి అంతగా కేడర్‌ లేదు.ఉన్నకొద్ది పాటి మందినీ అజహర్‌ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.నాయకత్వ లోపానికి తోడు ఎవ్వరి మాటా వినకపోవడం,గెలుపుపై అతివిశ్వాసం,మేనేజర్లనే నమ్ముకోవడం వంటి కారణాల వల్ల అజహరుద్దీన్‌ కోరి అపజయాన్ని మూటకట్టుకుంటారేమోనన్న అనుమానం కలుగుతోంది.

మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్నా:

వాస్తవంగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్నాయి.ఈ ఉద్దేశంతోనే అధిష్టానం స్థానిక నేతలను కాదని,స్థానికేతరుడు మైనార్టీ వర్గానికి చెందిన అజహర్‌కు సీటిచ్చింది.కానీ ఇక్కడ అనూహ్యంగా ఎంఐఎం కూడా అభ్యర్థిని బరిలోకి దింపడంతో అధిష్టానం కంగుతిన్నది.పార్టీ ఏదైనా మైనార్టీ ఓట్లు తమకే పడతాయని భావించిన అజహర్‌కు మజ్లిస్‌ షాకిచ్చిందనే చెప్పాలి.ఈ ఆశ కూడా పోవడంతో ఇప్పుడు కాంగ్రెస్‌ గెలుపు కోసం పోరాటం చేయాల్సి పరిస్థితి ఎదురైంది.

చేరికలు జరిగినా:

ఎలాగైనా అజహరుద్దీన్‌ను విజయతీరాలకు చేర్చాలని అధిష్టానం ఇక్కడ ఇతర పార్టీలకు చెందిన ముఖ్యలను పార్టీలోకి వచ్చేలా చేసింది.ముఖ్యంగా నవీన్‌యాదవ్‌, సీఎన్‌ రెడ్డి లాంటి అగ్రస్థాయి నేతలు కాంగ్రెస్‌లోకి రావడంతో కొంత కాంగ్రెస్‌కు కలిసి వస్తుందనుకున్నారు.కానీ వీరి ప్రభావం కేవలం రెండు డివిజన్లకే పరిమితమవడంతో కథ మళ్లీ మొదటికే వచ్చిందంటున్నారు.ఈ ఇద్దరి నేతల వల్ల జూబ్లీహిల్స్‌ సెగ్మెంట్‌లో పరిస్థితి మారేలా కన్పించడం లేదు.దీంతో మాగంటి గోపీనాథ్‌ లాంటి దిగ్గజ నేతను ఢీకొనడం అజహరుద్దీన్‌కు కష్టసాధ్యంగా మారుతోంది.ఆయన చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటూ ముఖ్యమైన మైనార్టీ నేతలను సైతం తనవైపు తిప్పుకోవడంలో సఫలీకృతమైనట్లు తెలుస్తోంది.

సంపన్నుల ఏరియాలకే పరిమితం:

ఇక అజహరుద్దీన్‌ ఎక్కువగా సంపన్నులు ఉండే ఏరియాల్లోనే ప్రచారం చేస్తున్నారని, బస్తీలు, కాలనీలు, పేదలు ఉండే ప్రాంతాలను పట్టించుకోవడం లేదని కిందిస్థాయి కేడర్‌ వాపోతున్నారు.ఆయన ప్రచార శైలి హైటెక్‌ పద్ధతిలో ఉంటోందని విమర్శలు వస్తున్నాయి. వాస్తవంగా నవీన్‌యాదవ్‌, సీఎన్‌ రెడ్డి వంటి లీడర్లను సరైన రీతిలో వినియోగించుకోవడంలో అజహర్‌ విఫలమయ్యారని అంటున్నారు.వాస్తవంగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో సంపన్నులతోపాటు బడుగు, బలహీన వర్గాల ప్రజలూ బాగానే ఉన్నారు. కాబట్టి మాస్‌ జనాలను ఆకర్షించాల్సిన అవసరమూ ఉంది.కానీ కాంగ్రెస్‌ అభ్యర్థి అజహర్‌ దీన్ని మర్చిపోయాడంటున్నారు.ఏది ఏమైనా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌పై ఉన్న ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకుని,ప్రచార శైలి మార్చుకుని,అందర్నీ కలుపుకొని పోకుంటే ఇక్కడ క్రికెట్‌ స్టార్‌ అజహరుద్దీన్‌ గెలుపొందడం కష్టమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మేనేజర్లతో మేనేజ్‌ చేస్తే కష్టమే :

ఇక అజహరుద్దీన్‌ ప్రచార శైలి కూడా చాలా దారుణంగా ఉందంటున్నారు. ఆయనకు స్థానిక సమస్యలపై ఎలాంటి అవగాహన లేదు. అందుకు ఓ ఉదాహరణ ఏంటంటే..ఇటీవల తన పర్యటనలో ఓ కాలనీ వాసులు డ్రైనేజీ సమస్య గురించి ప్రస్తావిస్తే…పోలీసులకు ఫిర్యాదు చేయండి అని సలహా ఇచ్చాడట. దీంతో స్థానికులతోపాటు ఆయన వెంట ఉన్న నేతలంతా షాక్‌కు గురయ్యారట. ఇకపోతే..కేడర్‌ కానీ..కింది స్థాయి నేతలు..కార్యకర్తలు పార్టీ పరిస్థితి గురించి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అస్సలు పట్టించుకోకుండా…తను నియమించుకున్న ప్రత్యేక మేనేజర్లను కలవండి అని వెళ్లిపోతున్నారట. దీంతో అజహర్‌ను కలవడమే గగనంగా ఉందని నేతలు అంటున్నారు. మేనేజర్లతో అన్నీ మేనేజ్‌ చేయొచ్చని ఆయన భావించడం ఎన్నికల్లో వర్కవుట్‌ కాదని పరిశీలకులు అంటున్నారు.

  • ఇక మైనార్టీ నేతలను మాత్రమే స్వయంగా కలుస్తూ ఇతర నాయకులు, ముఖ్యులను విస్మరించడం కూడా మైనస్‌ అంటున్నారు. జూబ్లీహిల్స్‌ సెగ్మెంట్‌లో మైనార్టీలతో పాటు ఇతరుల ఓట్లు కూడా ఉన్నాయన్న విషయాన్ని అజహర్‌కు గుర్తుచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కింది స్థాయి నేత ఒకరు వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది.
  • ఇక ప్రచారంలో తనతోపాటు కుటుంబ సభ్యులను మాత్రమే పట్టించుకుంటున్నాడట. ఇతర నేతలను ఎవ్వర్నీ అంతగా ఇన్‌వాల్వ్‌ చేయడం లేదని తెలుస్తోంది. మేనేజర్లు, కుటుంబ సభ్యుల వల్లే ఓట్లు రాలుతాయని భావించడం అజహర్‌ అవగాహన లోపాలనికి పరాకాష్ట అని అంటున్నారు.
  • ఎవరైనా కలవాలన్నా చిక్కడు…దొరకడు…రీతిలో అజహర్‌ వ్యవరిస్తున్నారట. రావడం…పోవడం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని, కనీసం రెండు మూడు గంటలైనా కింది స్థాయి నేతలు, కార్యకర్తలతో మాట్లాడడం లేదని అంటున్నారు.
  • ఇక మీడియాతోనూ సరైన అవగాహన లేదని తెలుస్తోంది. మీడియా విషయంలో ఎలా వ్యవహరించాలి…ప్రచారాన్ని ఎలా విస్తరించుకోవాలి..మీడియా ద్వారా ఓటర్లకు ఎలాంటి సందేశం ఇవ్వాలన్న కనీస అవగాహన కూడా లేదని కేడర్‌ వాపోతోంది. ఇలా ఉంటే ఇక గెలుపు ఎలా సాధ్యమని వారంటున్నారు.
  • క్రికెటర్‌గా అందరికీ తెలిసి ఉండడం..మైనార్టీ నేత ‍కావడం..ప్రస్తుతం కాంగ్రస్‌ వేవ్‌ నడుస్తోందనే ధోరణిలో కాంగ్రెస్‌ అధిష్టానం కూడా జూబ్లీహిల్స్‌ సెగ్మెంట్‌పై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. గెలుపుపై అతి ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. కాని అసలు పరిస్థితి వేరేలా ఉందన్న విషయం తెలియక అసలుకే ఎసరు తెచ్చుకుంటున్నారని పరిశీలకులు అంటున్నారు.

By ఎన్.మల్లేష్ ( వార్త ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *