నేనొస్తా..నన్ను చూసుకోండి ప్లీజ్‌

నేనొస్తా..నన్ను చూసుకోండి ప్లీజ్‌

  • గెలిచినా..ఓడినా కాంగ్రెస్‌లోకి వస్తా.
  • ఎన్నికలకు ముందే ‘హస్తం’ టచ్‌లోకి వెళ్లిన నగర మాజీ మంత్రి.
  • నిన్న రాత్రి కాంగ్రెస్ పెద్దలతో రహస్య సమావేశం.?
  • అధికారం ఎటువైపుంటే అటే వెళ్లేందుకు ఇద్దరు ముఖ్యనేతల ప్రయత్నం.
  • అప్పుడే అంచనాలు..లెక్కల్లో అగ్రగణ్యులు.
  • ఆ నోటా..ఈ నోటా బయటపడుతున్న వైనం.
  • ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిశీలకులు.

పోలింగ్‌ పూర్తి కాలేదు..రిజల్ట్‌ అంతకన్నా రాలేదు. కానీ కొందరు అధికార పార్టీ నేతలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఒక వేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ‘మేం కూడా వచ్చేస్తాం..మాకు అవకాశం ఇవ్వండి’ అని ముందస్తు దస్తీలు వేస్తున్నారట. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని రెండు కీలక నియోజకవర్గాలకు చెందిన నేతలు బీఆర్‌ఎస్‌లో బాగానే లబ్ధి పొందారు. వీరిలో ఒకరు మాజీ టీడీపీ నేత…మరొకరు మాజీ కాంగ్రెస్‌ నేత. వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆయా పార్టీల్లో ఓ వెలుగు వెలిగిన వారే.

తెలంగాణ వచ్చాక కూడా పార్టీలు మారి..అధికార పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించిన వారే. కానీ ఇప్పుడు రాష్ట్రంలో సీన్‌ మారుతోందన్న సంకేతాలు వస్తుండడంతో వీరు తమ పాత బుద్ధిని చూపుతున్నారట. కాంగ్రెస్‌కు అధికారం వస్తే వెంటనే అదే పార్టీలోకి జంప్‌ కావాలని చూస్తున్నారట. ఈమేరకు ఓ ముఖ్యనేత అయితే ఏకంగా ఓ సామాజిక వర్గం నేతలను సమావేశ పరచి..తాను బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్తాను. నాకు అక్కడ మంచి పొజిషన్‌ వస్తుందంటూ వారిని ఓట్లు అర్థించారట. ఇది ఇప్పుడు ఆనోట..ఈనోట బయటకు వచ్చి అంతర్గతంగా చర్చనీయాంశమైంది. ఇక మరో నేత పాతపరిచయాలను అడ్డుపెట్టుకుని ఏకంగా కాంగ్రెస్‌ నేతలతో రహస్య మంతనాలే జరిపినట్లు వినికిడి. అధికారం వస్తే నేనూ వస్తా..నన్ను చూస్కోండి అని మాట తీసుకున్నారట. ఈ నేత మొదట కాంగ్రెస్‌ నుంచి గెలిచి ఆనక..బీఆర్‌ఎస్‌లో చేరిన వ్యక్తే. ఈయనకు పార్టీల మారే అలవాటు చాలానే ఉంది మరి.

మరీ ఇంత బరితెగింపా :

సాధారణంగా ఎన్నికల ఫలితాలు వచ్చాక విన్పించే పుకార్లు ఇప్పుడే షికారు చేయడం పరిశీలకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎన్నికలకు ముందే జంప్‌జిలానీల ముచ్చట బయటపడడం.ఎన్నికల చరిత్రలోనే మొదటిసారేమో అన్పిస్తోంది.ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇలా ఎన్నికలకు ముందే బేరమాడడంపై విమర్శలు వస్తున్నాయి.ఎన్నో పదవులు అనుభవించిన వీరే ఇలా బరితెగిస్తే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుందని అంటున్నారు.గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం విదితమే.

ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయితే బీఆర్‌ఎస్‌ టు కాంగ్రెస్‌లి అదేవిధమైన చేరికలుంటాయేమోనని అనుకుంటున్నారు.ఇక ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకుండా ఒకవేళ హంగ్‌ వచ్చినా జంప్‌ జిలానీలకు డిమాండ్‌ బాగా ఉంటుందంటున్నారు.మొత్తం మీద పోలింగ్‌కు ముందే తెలంగాణలో ఇప్పుడు ‘జంపింగ్‌’ స్టోరీలు నడవడం గమనార్హం.

By ఎన్.మల్లేష్ ( వార్త ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *