దానం కి “దండం” విజయ”కి ఆశీస్సులు
- ఖైరతాబాద్‌లో ‘కారు’కు బ్రేక్ డౌన్?
- వేగంగా మారిన రాజకీయ పరిణామాలు.
- పీజేఆర్ కూతురిగా వేగంగా ఎదిగిన విజయారెడ్డి.
- అడుగడుగునా లభిస్తున్న పీజేఆర్ అభిమానుల ఆదరణ.
- దానంకు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత.
- సారీ చెప్పినా మారనీ సీన్.
- వెన్నుపోటుకూ వెరవని మాజీ కార్పొరేటర్లు.
- పోలింగ్ సమీపిస్తున్న వేళ…దానం శిబిరంలో కలకలం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పేరు ప్రఖ్యాతులు గడించిన…ముఖ్యంగా తెలంగాణ నుంచి ఒక వెలుగు వెలిగి రాష్ట్రవ్యాప్త కీర్తి గడించిన వారిలో పీజేఆర్ (పి.జనార్దన్‌రెడ్డి) అగ్రగణ్యుడు. ఢిల్లీ అధిష్టానంతో పాటు రాష్ట్ర ముఖ్యనేతలూ అప్పట్లో పీజేఆర్‌ను ఎంతో గౌరవించేవారు. ప్రజల మనిషిగా..మాస్ లీడర్‌గా ఆయన ఒక ప్రత్యేకతను నిలుపుకొన్నారు. అంతటి గొప్ప నేత కుమార్తెగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పి.విజయారెడ్డి ఇప్పుడు ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిల్చున్నారు. మరి పీజేఆర్ వారసత్వాన్ని ఆమె నిలుపుతుందా…పేదల గుండెల్లో స్థానం సంపాదిస్తుందా..దానం నాగేందర్ లాంటి బలమైన ప్రత్యర్థిని ఓడిస్తుందా అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు.ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానంలో ఈసారి దానం నాగేందర్‌కు ఓటమి తప్పదేమో అన్న వాదనలూ విన్పిస్తున్నాయి.
తండ్రిపై అభిమానం..కూతురిపై కురుస్తోంది :
ఖైరతాబాద్‌లోని గల్లీ గల్లీ..బస్తీ బస్తీలన్నీ పీజేఆర్‌ను ఇప్పటికీ ఎంతో గౌరవిస్తాయి. ఆయనకంటూ ఒక ఓటు బ్యాంటుకే సృష్టించుకున్న గొప్పనేత పీజేఆర్. ఆయన ఓటు బ్యాంకు ఇప్పుడు విజయారెడ్డికి ప్లస్ అంటున్నారు. ఆయనపై ఉన్న అభిమానం పీజేఆర్ తనయ విజయారెడ్డిపైనా చూపేందుకు ఓటర్లు సంసిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇది బీఆర్‌ఎస్ అభ్యర్థి నాగేందర్‌కు పెద్ద దెబ్బే అంటున్నారు. ముఖ్యంగా పీజేఆర్ అనుచరులు…ఆయనను వెన్నంటి ఉన్న కొందరు నేతలు, కార్యకర్తలు ఇప్పుడు విజయారెడ్డి వెన్నంటి నడుస్తున్నారు. ఆమె చాపకింద నీరులా తన ప్రచారాన్ని ఉధృతం చేయడంతో బస్తీలన్నీ విజయారెడ్డిని ఆదరిస్తున్నాయి. ఆమె ఇంటింటి ప్రచారానికి లభిస్తున్న ఆదరణ చూసి రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘పీజేఆర్ బిడ్డవా తల్లీ..మీ నాయన మాకు తెలుసు. చాలా మంచోడు. నీకే ఓటేస్తంలే’ అని చాలా మంది వృద్ధులు, మధ్యతరగతి ప్రజలు చెప్పడం చూస్తుంటే దానంకు కష్టమే అన్పిస్తోంది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ శాతం విజయారెడ్డివైపే ఉన్నారు. పీజేఆర్‌పై ఉన్న అభిమానం పూర్తిగా విజయారెడ్డి వైపు మళ్లితే విజయం ఏకపక్షమే అనొచ్చు.
దానం నమ్మినోళ్లే హ్యాండిస్తున్నారా? :
ఇక బీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గెలుపుపై అతి విశ్వాసంతో ఉండి..అసలుకే మోసం తెచ్చుకుంటున్నారా…ఆయన నమ్మిన వ్యక్తులే ఇప్పుడు ఆయనకు వెన్నుపోటు పొడుస్తున్నారా…ఎన్నికల సమరంలో మొదట ఉన్న ఊపు ఉత్సాహం రానురాను తగ్గుతోందా…అంటే అవుననే వాదనలు విన్పిస్తున్నాయి. దానం వల్ల ఎదిగిన నేతలే.. నేడు అయన చేసిన తప్పుల వల్ల ఓడించాలి అని పట్టుదలాగా ఉన్నట్టు తెలుస్తుంది.
దానంను నమ్ముకున్న పలువురు మాజీ కార్పొరేటర్లు..తదనంతర కాలంలో దానం నాగేందర్ వల్లే ఆర్థికంగా.. రాజకీయంగా తొక్కి వేయబడ్డారు అన్న ప్రచారం ఉంది. ఈ కసిని మనసులో దాచుకున్న సదరు వర్గం ఇప్పుడు అదునుచూసి దెబ్బకొడుతున్నారని అంటున్నారు. ముఖ్యంగా కొందరు దానం వెంట ఉంటూనే విజయారెడ్డి విజయానికి గుట్టుచప్పుడు కాకుండా కృషి చేస్తున్నారని తెలిసింది.
క్షమాపణ చెప్పినా :
కొంత నెగటివిటీని కనిపెట్టిన దానం మొదట్లోనే పశ్చాతాపంతో సారీ చెప్పేశారు కూడా.‘ఎన్నికల సమయంలో విభేదాలు వద్దు..పాత తప్పులు మర్చిపోండి..నన్ను క్షమించండి’ అంటూ తన వ్యతిరేక వర్గాన్ని తిరిగి దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు.. ఐనా పరిస్థితి మారలేదని తెలుస్తోంది. ప్రచారంలో..ర్యాలీల్లో పాల్గొంటున్న అనేక మంది నేతలు కేవలం బయటికి మాత్రమే దానంకి మద్దతుగా నిలుస్తున్నారని సమాచారం. లోలోన వెన్నుపోటుకు సిద్ధమయ్యారని అంటున్నారు. మరో వైపు తెలంగాణ ఉద్యమ సమయంలో దానం వీరంగంతో ఆయనపై వ్యతిరేక భావం ఏర్పడింది. పార్టీలు కూడా ఈజీగా మార్చేస్తాడన్న చెడ్డపేరూ ఉంది. వీటన్నిటితో పాటు విజయారెడ్డికి లభిస్తున్న ఆదరణ..ఆమె రాజకీయంగా ఎదుగుతున్న తీరు…పీజేఆర్ అభిమానుల రూపంలో లభిస్తున్న మద్దతు..ప్రత్యేక ఓటు బ్యాంకు..రాష్ట్రంలోనూ ఉధృతమైన కాంగ్రెస్ వేవ్ నేపథ్యాలు 2023 ఎన్నికల్లో దానం గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
By ఎన్.మల్లేష్ ( వార్త ).