ఆ అధికారులు ‘చేతులు’ కలిపారా?

ఆ అధికారులు ‘చేతులు’ కలిపారా?

  • కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్న కొందరు ఐపీఎస్‌లు.
  • వారి బంధువులు, కుమారుల చేత పరోక్ష సేవలు.
  • బదిలీలకు గురైన అధికారుల్లో ఈ ధోరణి అధికం.
  • ఆశ్చర్యపోతున్న రాజకీయ వర్గాలు.

తెలంగాణ వచ్చాక అత్యధికంగా లబ్ధి లేదా ప్రయోజనం పొందిన ప్రభుత్వ విభాగం ఏదైనా ఉందా అంటే,టక్కున చెప్పే సమాధానం పోలీస్‌ విభాగం పేరు.అవును,తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ పోలీస్‌ విభాగానికి అధికంగా నిధులు కేటాయించడంతో పాటు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ.వారు అడిగినవన్నీ ఇస్తూ ఎంతో మేలు చేశారు. ఇది జగమెరిగిన సత్యమే. దీంతో సాధారణంగానే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వారు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారని ఓ నానుడి అయితే ఉంది. కానీ,ఇప్పుడు సీన్‌ మారిందంటున్నారు. బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తారని భావిస్తున్న కొందరు పోలీస్‌ ఉన్నతాధికారులు(ఐపీఎస్‌) ఇప్పుడు ప్లేట్‌ ఫిరాయించారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ,వీరంతా పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీకి ప్రయోజనం చేకూర్చే పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఐపీఎస్‌ల కుమారులు, బంధువులు కాంగ్రెస్‌ నేతలకు సహకరిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు బదిలీలకు గురైన ఐపీఎస్‌లు ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.దీంతో కింది స్థాయి బీఆర్‌ఎస్‌ కేడర్‌ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

శాఖ మార్చారని ‘వాత’ పెడుతున్నారా :

ఇక ఇటీవల తన శాఖను మార్చారన్న అక్కసుతో ఓ ఐపీఎస్‌ అధికారి పూర్తిగా విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నారని సమాచారం. ఆయన తెర వెనుక కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.బీఆర్‌ఎస్‌ మీద అక్కసుతో నేరుగా ‘చేతులు’ కలిపారని తెలిసింది.గతంలో తన నుంచి లబ్ధి పొందిన నేతలను, ద్వితీయ శ్రేణి నాయకులకు క్రాంగెస్‌ కండువాలు కప్పడంలోనూ ఈ ఐపీఎస్‌ కీలక పాత్ర పోషించారని అంటున్నారు.అడిగిన శాఖలో పోస్టింగ్‌ ఇవ్వలేదనే కోపంతోనే ఇలా చేస్తున్నారని తెలిసింది.ఇక గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నుండి లబ్ధి పొంది,తెర వెనుకకు నెట్టివేయబడిన మరికొందరు ఐపీఎస్‌లు నేరుగా ఢిల్లీ నేతలతో టచ్‌లో ఉంటూ అవసరమైన సమాచారం, సహకారం అందిస్తున్నారట.
ఇక హైదరాబాద్ నగర శివారులో కొందరు పోలీసులు బహిరంగంగానే తమకు నచ్చిన నేతకు సేవలు అందిస్తున్నారని సమాచారం.

అడ్డుకట్ట వేయాల్సిందే :

వాస్తవంగా ఐపీఎస్‌ అధికారులు అంటే కఠినమైన క్రమశిక్షణకు మారుపేరు.వీరు ఎలాంటి రాగద్వేషాలు,బంధు ప్రీతి లేకుండా సమాజంలో కీలకమైన సేవలందిస్తారని పేరు. ప్రజల్లోనూ ఇదే రకమైన గౌరవం ఉంది. కానీ గత ఏడెనిమిదేళ్లుగా ఐపీఎస్‌లను వినియోగించడంలో పాలక, ప్రతిపక్ష పార్టీలు వింత పోకడలు అవలంబించాయని విమర్శకులు అంటున్నారు.తమ స్వప్రయోజనాల కోసం ఐపీఎస్‌లకు తాయిలాలు వేయడం,అనుకూలురైన వారిని కీలక విభాగాల్లో నియమించడం.బదిలీల్లో విపరీత ధోరణులు ప్రదర్శించడం.తమ,పర అనే విభేదాలు క్రియేట్‌ చేయడంలో రాజకీయ పార్టీలు సఫలీకృతమయ్యాయని అంటున్నారు.ఈ ధోరణి వల్లే ఇప్పుడు ఆయా పార్టీలకు తలనొప్పులు వచ్చాయని అంటున్నారు.ఏ పార్టీ అయినా,ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారుల జోలికి వెళ్లకుండా ​‍ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరిస్తేనే సమాజానికి మంచిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే అధికారులు కూడా రాగద్వేషాలకు తావివ్వకుండా క్రమశిక్షణతో వ్యవహరించి తమ స్థాయిని నిలబెట్టుకోవాలంటున్నారు.

By ఎన్.మల్లేష్ ( వార్త ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *