సనత్ నగర్ లో “వాడి పోతున్న కమలం “
- “మర్రి “కి దూరంగా బీజేపీ నేతలు.
- “సుందర వదనుడు” పై వ్యతిరేకత.
- మేల్కొనకపోతే మూడవ స్థానమే !
- కలుపుకుపోలేక పోతున్న మర్రి.
- ఓటు బ్యాంకు ఉన్నా వృధా అయ్యే అవకాశం.
సనత్ నగర్ :
ధనిక, పేద తారతమ్యాలు లేకుండా, ఎక్కడి నుండో వలస వచ్చిన వారికి హైదరాబాద్ నగరంలో ఆశ్రయం ఇస్తున్న ప్రధాన నియోజకవర్గం.
ఈ నియోజకవర్గం లో రాజకీయాలకు కొదువే లేదు…ప్రధాన పక్షాలైన బి ఆర్ ఎస్, కాంగ్రెస్ ల సంగతి పక్కన పెడితే ఈ నియోజకవర్గం లో బలమైన ఓటు బ్యాంక్, కార్యకర్తలు ఉన్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో ఉత్తాన, పతనాలను చూస్తోంది…నియోజకవర్గం లో ఒకవైపు మహంకాళి అమ్మవారు, మరోవైపు బల్కం పేట ఎల్లమ్మ తల్లి ఉన్నా హిందుత్వానికి ప్రతీక తామే అని చెప్పుకుంటున్న బీజేపీ లో నాయకత్వ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
హెచ్చు మీరిన గ్రూపు తగాదాలు :
కార్యకర్తలు మెండుగా ఉన్నా, ప్రత్యర్థి వర్గంలో మంత్రిగా బలమైన నాయకుడు ఉన్నా కూడా అమీర్ పేట్ డివిజన్ కార్పొరేటర్ గా బీజేపీ అభ్యర్థి గెలిచారంటే ఇక్కడ బీజేపీకి ఎంత బలముందో చెప్పనక్కర లేదు… ఐతే ఈ నియోజకవర్గంలో ఇప్పటికే గ్రూప్ తగాదాలతో బీజేపీ కొట్టుమిట్టాడుతుండగా ఈసారి కాంగ్రెస్ నుండి మరో పెద్ద నాయకుడు “మర్రి” వచ్చి చేరడంతో ఈ గ్రూప్ కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి…ఒకవైపు శ్యామ్ సుందర్ వర్గం, మరోవైపు ఆకుల విజయ వర్గం ఇలా ప్రతీ డివిజన్ కు ఒక నాయకుడు ఉండడం బీజేపీ కి అనుకూల అంశం ఐనా ఆ అన్ని డివిజన్ ల నాయకులను ఏకతాటిపైకి తెచ్చే నాయకుడు కరువవ్వడం బీజేపీ కి ప్రధాన ప్రతికూల అంశంగా మారింది.
ఇది ఎంతలా ఉందంటే మొన్నటికి మొన్న ఒక నూతన కార్యాలయం ప్రారంభం చేద్దామనుకుంటే అక్కడా వర్గవిబేధాలు తారాస్థాయికి చేరి ప్రారంభోత్సవం లోనే కుమ్ములాటలు జరిగినట్లు సమాచారం.
ఇప్పటికే బన్సీలాల్ పేట,అమీర్ పేట్, సనత్ నగర్ డివిజన్ లలోని సీనియర్ నాయకులు పార్టీకి దూరమవగా ,పార్టీ లోకి కాంగ్రెస్ నుండి నూతనంగా వచ్చిన మర్రికి సనత్ నగర్ టికెట్ కేటాయించారు.
ఈయనకు ఏ ఒక్క వర్గం కూడా సహకరించట్లేదని, కనీసం ఆయనతో ప్రచారం చేయడానికి ఒక్క కార్పొరేటర్ తప్ప నాయకులు ఎవరు అందుబాటులో ఉండట్లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఏదేమైనా బలమైన కార్యకర్తలు ఉండి, బలమైన ఓటు బ్యాంక్ ఉండి కూడా చేజేతులా పార్టీ ని దిగజార్చుకుంటున్న పరిస్థితి ని చూసి నిజమైన కార్యకర్తలు కుమిలి పోతున్నారన్నది మాత్రం వాస్తవం.
By ఎన్.మల్లేష్ ( వార్త ).